Sunday 5 February 2017

పగిలిన పెదాలకు పాలూ తేనె!

పగిలిన పెదాలకు పాలూ తేనె!
చాలామందికి పెదాలు పగిలి.. బీటలు వారుతుంటాయి. ఒక్కోసారి రక్తస్రావం కూడా అవుతుంటుంది. అలాంటప్పుడు ఇంట్లో దొరికే పదార్థాలతోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

చెంచా చొప్పున గులాబీ నీళ్లు, తేనె కలిపి పెదాలకు రాసుకోవాలి. పావుగంట తరవాత దూదితో తుడిచి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే పెదాలు మృదువుగా మారతాయి. చర్మం తాజాగా మారుతుంది.
రాత్రిపూట నిద్రించడానికి ముందు చెంచా తేనె పెదాలకు రాసుకుని పడుకోవాలి. ఓ అరగంట తరవాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే పొడిబారిన పెదాలకు తేమ అందుతుంది. పగుళ్లూ తగ్గుముఖం పడతాయి. నెయ్యి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
వేణ్నీళ్లలో ముంచి తీసిన గ్రీన్‌ టీ బ్యాగును కాసేపు పెదాల మీద ఉంచాలి. మధ్య మధ్యలో నొక్కి పడుతూ ఉండాలి. ఈ టీలోని యాంటీఆక్సిడెంట్లు పగిలిన పెదాలకు మేలు చేస్తాయి. పెదాలు తాజాగానూ కనిపిస్తాయి.
కీరాదోస ముక్కల్ని గుజ్జుగా చేసి రసం తీసుకోవాలి. అందులో దూది ఉండల్ని ముంచి తీసి పెదాల పై ఉంచాలి. ఇరవై నిమిషాల తరవాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే చర్మానికి తేమ అంది తాజాగా మారతాయి. పగుళ్లూ బాధించవు.
పెదాలపై చర్మం పొలుసుగా రాలిపోతుంటే బేబీ బ్రష్‌లతో మృదువుగా రుద్దాలి. ఆ తరవాత ఆలివ్‌ నూనెలో చక్కెర కలిపి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి. కాసేపాగి చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఆ తరవాత లిప్‌బామ్‌ రాసుకుంటే సమస్య త్వరగా తగ్గిపోతుంది.
గులాబీ రేకల్ని పాలల్లో నానబెట్టి రెండు గంటల తరవాత మెత్తగా నూరి పెదాల మీద పూతలా వేసుకోవాలి. పావుగంట అయ్యాక చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుని పెట్రోలియం జెల్లీ రాసుకుంటే పగిలిన పెదాలకు సాంత్వన అందుతుంది. కాలం ఏదైనా సాధ్యమైనంత వరకూ మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. దీనివల్ల శరీరం జలహీనత(డీహైడ్రేషన్‌)కి గురికాకుండా ఉంటుంది. పెదాలు తేమను కోల్పోవు.
LIPCARE,LIP CARE TIPS,LIP CARE FOR MILK AND HONEY,LIP CARE TIPS IN TELUGU,TELUGU BEAUTY TIPS,BEAUTY TIPS IN TELUGU.